Breaking
Loading...

Today's Quote

Today's Quote
Home » » క్రీస్తు తో ప్రయాణం

క్రీస్తు తో ప్రయాణం

 
 
 మార్కు 13వ అధ్యాయములో యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు తనను వెంబడించిన శిష్యులతో అంత్య దినములలో జరగబోయే విషయాలు తెలియజేసిన సందర్భము. ఈ అధ్యాయములో యేసు ప్రభువు మూడు ప్రముఖ్యమైన విషయములను వివరిస్తున్నారు.
1. ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి (మార్కు 13:5)
2. మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి (మార్కు 13:9)
3. మెలకువగా ఉండుడి (మార్కు 13:37)
ఇవి 12 మంది శిష్యులకు మాత్రమే కాదు కాని, ఎవరు క్రీస్తుని దేవునిగా అంగీకరించి నమ్మి బాప్తీస్మము పొంది తన శిష్యులుగా మార్చబడి, క్రీస్తుతో ప్రయాణం చేస్తున్నారో, వారందరితో చెప్పబడిన విషయాలు. మార్కు 13:23లో ...ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పియున్నాను అని ఉంది. తరువాత ఈ విషయాలు నాకు తెలియదు అనుటకు వీలులేదు అని అర్ధమే కదా?
ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి : ప్రస్తుత దినాలలో అనేకమైన పరిచర్యలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన విస్తారముగా వాక్యము ప్రకటించబడుచున్నది. ఎవరిని గమనించినా మేమే సత్యము ప్రకటిస్తున్నాము అని చెప్పుచున్నారు. ఒక విశ్వాసి ఏది సత్యమో, ఏది అసత్యమో ఎలా తెలుసుకుంటాడు. ఒక విశ్వాసి ఎలా మోసగించపడచున్నాడు?
ప్రస్తుత పరిస్తితులు గమనిస్తే అనేకమంది క్రైస్తవులు క్రీస్తుని సంపూర్ణముగా తెలుసుకోవాలి, క్రీస్తుతో పరిశుద్ధముగా నడవాలి. క్రీస్తునకు మహిమకరముగా జీవించాలని దేవుని దగ్గరకు రావడంలేదు. అద్భుతాల కొరకు, స్వస్థతలకొరకు, ఇన్స్టెంట్ ఆశీర్వాదము కోరకు వస్తున్నారు. ఆది అపోస్తలుల దినాలలో సత్యము ప్రకటించబడుటకు, సంఘము విస్తరించబడుట కొరకు, పరిశుద్ధుల అవసరతలు తీర్చబడుట కొరకు చరస్థిరాస్తులను అమ్మి అపోస్తలులకు ఇస్తే. ఈ దినాలలో స్వస్థతలకొరకు, అద్భుతాల కొరకు ఇస్తున్నారు.
అనేకమంది క్రైస్తవులలో ఓపిక తగ్గిపోవుచున్నది. ఏదైన త్వరగా జరగాలి అని కోరుకోనుచున్నారు . యాకోబు 1:4 లో...ఏ విషయములోనైనను కొదువ లేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు నడిపిస్తాడు, పరిగెత్తించడు. అనేకులు నడిపించు ప్రభువా అని ప్రార్ధన చేసి, పరుగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు... ఎందుకో? విశ్వాసములో స్థిరముగా ఉండాలి, ప్రార్ధన జీవితము పెంచుకోవాలి, వాక్యము సంపూర్ణముగా తెలుసుకోవాలి అని ప్రయత్నం చేయడంలేదు. ఇన్స్టెంట్ కాఫి వచ్చినట్లు , ATM లో ఇన్స్టెంట్ మని వచ్చినట్లు, ఆత్మీయతలో కూడ త్వరగా కార్యములు జరగాలి, త్వరగా ఎదిగిపోవాలి అని ఆశపడుచున్నారు. మరి కొందరు ఒక సంఘము నుండి మరి యొక సంఘమునకు మారుతూ స్థిరమైన సహవాసం లేకయున్నారు. మరి కొందరు సంఘాలను చీల్చుతూ క్రొత్త సంఘాలను నిర్మిస్తున్నారు. దేవుడు సంఘాలను చీల్చడు కాని, సంఘాలను ఆశీర్వదించి విస్తరింపచేస్తాడు. ప్రతి ఆలోచన దేవుని ఆలోచనగానే భావిస్తు తొందరపాటు నిర్ణయాలతో అపవాదికి అవకాశమిస్తున్నారు. అందుకే సులువుగా అనేకమంది మోసపోవుచున్నారు .
మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి: యేసు ప్రభువు నిజమైన దేవుడు అని నమ్మువాడు గ్రుడ్డిగా నమ్మాలి అందులో ఏ సందేహము లేదు. కాని, యేసు ప్రభుని వెంబడించువాడు చాలా జాగ్రత్తగా వెంబడించాలి. కీర్తన 53:2 లో వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను. అవును ప్రియ చదువరీ! గ్రుడ్డిగా వెదకువారు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. దేవుని వెదకువారికి వివేకము కావాలి. మనము అదృశ్యమైన దేవుని, కనిపించని దేవుని వెదకుచున్నాము.
మార్కు 13:22 లో ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి సాధ్యమైన యెడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. అంత్య దినాలలో వచ్చేది క్రీస్తే కాని, అబద్ధం. యేసు నామములో ప్రవచిస్తారు కాని, అబద్ధం. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వేరొక గ్రంథము, వేరొక రూపమును కనుపరచరు. పరిశుద్ధ గ్రంథమునే బోధిస్తారు, క్రీస్తునే ప్రకటిస్తారు కాని, అబద్ధం ప్రకటిస్తారు.
వీరు ఎక్కడ నుండి వస్తారు? మార్కు 14:18లో నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని ఉంది. ఇస్కరియోతు యూదా క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించాడు. క్రీస్తు చేసిన అద్భుతములలో, చెప్పిన బోధలలో పాలుపంచుకున్నాడు. అంతేకాదు ఆయన శ్రమలలో, శోధనలలో కూడా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా కూడా సువార్త ప్రకటించి, స్వస్ధతలు చేసి, దయ్యములను వెళ్ళగొట్టాడు, క్రీస్తుతో కలిసి ప్రయాణం చేసి, ఆయనతో భోజనం చేసి చివరికి క్రీస్తూనే అప్పగించాడు. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు ఆకాశములో నుండి ఊడిపడరు. వారు సంఘములోనుండి, మన మధ్యనుండే వస్తారు. సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సైతం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మిమ్మును గూర్చి మిరే జాగ్రత్తపడుడి.
మెలకువగా ఉండుడి : మార్కు 13:34 లో ఒక మనుష్యుడు తన యింటిలో ఉన్న దాసులకు అధికారమిచ్చి ఇంటిలో ఉన్న ప్రతివానికి వాని వాని పని నియమించి దేశాంతరము వెళ్ళినాడు. ఇక్కడ సంఘము గురించి వ్రాయబడినది. దేవుడు సంఘములో దాసులకు అధికారం ఇచ్చి, సంఘములోని ప్రతివానికి వాని వాని పని నియమించినాడు కాని, అనేకమంది క్రైస్తవులు దేవుని పని చెయ్యకుండా ఈ పని నాది కాదు అని తప్పించుకొని తిరుగుచున్నారు. ప్రతి క్రైస్తవుడు దేవుని పని చెయ్యాలి. మత్తయి 20:16 లో ద్రాక్షతోట యజమాని దగ్గర పని ఉంది. పని చేసే వారికి ఇచ్చుటకు జీతము కూడ తన దగ్గర ఉంది. దేవుని పని అంటే వాక్యము బోధించుట మాత్రమే కాదు, సంఘములో చాలా పరిచర్యలు ఉన్నాయి అవి చేయవలసిన బాధ్యత క్రైస్తవుడు అని పిలువబడుచున్న ప్రతి ఒక్కరిది.
ఇది ఇలాగ ఉండగా అనేకమంది క్రైస్తవులు నిర్లక్ష్యముగా జీవిస్తున్నారు. క్రీస్తుని తెలుసుకోనక ముందుకంటే, క్రీస్తుని తెలుసుకొనిన తరువాతనే ఎక్కువగా పాపం చేస్తున్నారు. రక్షణ బాప్తిస్మము అంటే పాపాలనుండి విడుదల పొందుకోవడం అని మరిచి, రక్షణ బాప్తిస్మము పొందటం అంటే పాపము చేయుటకు పరలోకంనుండి పొందిన లైసెన్స్ వలె భావిస్తున్నారు, భయం విడచి పాపం చేస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఏ కష్టం లేకుండా సుఖముగా జీవించాలి అని సంవత్సరాలు, సంవత్సరాలు ఆలోచిస్తున్నారు కాని, ఆత్మీయముగా ఎలా ఎదగాలి, పరలోక ధనం ఎలా సంపాదించాలి అని దినములో కొన్ని నిమిషములు కూడా ఆలోచించలేకపోవుచున్నారు.
మత్తయి 7:22 లో – ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగోట్టలేదా ? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా ? అని చెప్పుదురు. అప్పుడు – నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని సెలవిస్తుంది. ఇక్కడ వీరికి ప్రవచన వరం ఎవరు ఇచ్చారు? దయ్యములను వెళ్ళగొట్టె వరం ఎవరు ఇచ్చారు? అద్భుతములు చేసే వరం ఎవరు ఇచ్చారు? వీరి పాపములు క్షమించి, రక్షణ ఇచ్చి పరిశుద్ధాత్మ అను వరం ఇచ్చింది ఎవరు? పేరు పెట్టి సేవకు పిలిచింది ఎవరు? క్రీస్తే కదా? ఆ రక్షించిన దేవుడే ఇక్కడ మిమ్మును ఎన్నడు ఎరుగను అని ఎలా చెప్పుచున్నాడు? వారు మొదట నీతిగానే ఉన్నారు కాని, తరువాత అక్రమము చేసారు. మొదట క్రీస్తుతో ప్రయాణం చేసారు కాని, తరువాత క్రీస్తుని విడిచిపెట్టారు.
లూకా 21:34 లో మీ హృదయములు ఒక వేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మత్తయి 24:50 లో నిర్లక్ష్యముగా ఉండే వారిని, మెలుకువ లేని వారిని, క్రీస్తుతో కలసి సమకూర్చని వారిని, నరికించి వేస్తాను అని వాక్యభాగం సెలవిస్తుంది. ప్రియ చదువరి! ఎవరి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు. ఈ లోకంలో చేసిన, చేస్తున్న ప్రతి పనికి ఒకదినాన ఎవరికి వారే లెక్కచెప్పాలి. రక్షించబడిన నీవు ఈ లోకములో ఎలా క్రీస్తుతో ప్రయాణం చేస్తున్నావు...?
Share this Post Share to Facebook Share to Twitter Email This Pin This

0 comments:

Post a Comment

 
Copyright © 2014. JESUS | Distributed By My Blogger Themes | Designed By OddThemes