మత్తయి
4:17 “యేసు ... పరలోక రాజ్యము సమీపించియున్నది. గనుక మారుమనస్సు పొందుడని
చెప్పుచు మొదలు పెట్టెను. ప్రియులారా, ప్రభువు సెలవిచ్చిన రీతిగా ఆ పరలోక
రాజ్యమునకు చేరాలంటే మారుమనస్సు మనకు అవసరమై యున్నది. పరలోక రాజ్యమంటే
ఆధ్యాత్మిక పరిపాలన, దాని మూలాధారం పరలోకంలో వుంది. మారు మనస్సు పొందుట
అనగా మనం పశ్చాత్తాపపడి మన జీవితాల్లో మన హృదయాల్లో దేవుని పరిపాలనను
అంగీకరించాలని ప్రభువు ప్రకటిస్తున్నారు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును
నీతిని మొదట వెదకుడి. అప్పుడవన్నియు మీకనుగ్రహించబడును
(మత్తయి 6:33).
ఆ పరలోక రాజ్యమునకు వెళ్ళాలంటే మనకు కావలసిన కొన్ని అర్హతలు బైబిలు గ్రంథములో వ్రాయబడినవి.
1. మత్తయి 18:1-4 చిన్న పిల్లలవలె తగ్గించుకొనే మనసు. చిన్న పిల్లల మనసు
కల్లాకపటం లేకుండా లోబడే స్వభావం అమాయకమైన నమ్మకం. చిన్న పిల్లలు తమకు
గొప్పతనం కలగాలని తాపత్రయపడరు. పేరు ప్రఖ్యాతలు కొరకు ప్రయాసపడువారు
పరలోకరాజ్యంలో ప్రవేశించరు అని ప్రభువు సెలవిస్తున్నారు. మొట్టమొదటి షరతుగా
స్వార్ధత్యాగం చేసుకోవడం నేర్చుకోవాలి. “నేను” అనే స్వభావాన్ని
పరిత్యజించుకోవాలి. ఎప్పుడైతే చిన్న పిల్లల మనసు మనం కలిగి ఉంటామో మనలను
మనం ఉపేక్షించుకొని ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించగలము(మత్తయి
16:24). అంతేకాకుండా చిన్నపిల్లలవలె మనం దీనులముగా తగ్గించుకొంటామో దేవుని
దయను పొందుకొని (సామెతలు 3:34) ఆ పరలోక రాజ్యమును చేరుటకు అర్హులముగా
ఉండగలము . చిన్న పిల్లలు కలిగియున్న మనసు మనం కలిగి ఉన్నామా?
2. మత్తయి 7:21-23 తండ్రి చిత్తప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో
ప్రవేశించును. మంచి పనులవల్ల పాప విముక్తి రక్షణ కలుగదు. మనుష్యులు
పశ్చాత్తాపపడి ప్రభువుపై నమ్మకముంచి ఆయనకు లోబడి ఆయన చెప్పినట్లు చేయాలని
దేవుని సంకల్పము. మత్తయి 7:23 నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. అక్రమము
చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ వచనంలో కపట
ప్రవక్తలను ఖండించుట చూస్తున్నాము. ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ ఇంకా అవిధేయత
అనే ముసుగులో దేవుని సంకల్పాన్ని నెరవేర్చకుండా వేశధారులముగా జీవిస్తే,
ఆయన చెప్పినట్టు చేయకుండా ఉంటే ఆయన మనలను కూడా మిమ్మును ఎన్నడును ఎరుగను
అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని మనతో చెప్పును. కనుక మన
హృదయాలను పరీక్షించుకొని సరి చేసుకుందాము. కేవలం ప్రభువా, ప్రభువా అని
పిలుచువారి వలె కాకుండా దేవుని చిత్తప్రకారము చేయువారముగా వుండాలి. I థెస్స
4:3-5 మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగ నుండుటయే దేవుని
చిత్తము. I కొరింధీ 6:18-20 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. అనగా లైంగిక
అవినీతి సంబంధమైన ఆలోచనలను కూడా విశ్వాసులముగా మనం అనుమతించ కూడదు. ఎఫెసీ
5:3-5 మీలో జారత్వమే గాని ఏవిధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి
పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అయన పరిశుద్ధుడు గనుక మనము
పరిశుద్ధులముగా వుండాలి. పరిశుద్ధు - లముగా వుండుటకే ఆయన మనలను పిలిచెను
గాని, అపవిత్రులముగా నుండుటకు ఆయన పిలువలేదు. ఎఫెసీ 5:5 వ్యభిచారియైనను,
అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను క్రీస్తుయొక్కయు, దేవుని
యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును గనుక
వీటిలో ఏ ఒక్కటి ఈ జీవితంలో మనము కలిగి వున్నా అయన చిత్తాన్ని
నేరవేర్చువారముగా వుండలేము. ఆయన రాజ్యమునకు హక్కుదారులముగా వుండలేము. I
థెస్స 5:16,18 ప్రతీ విషయమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట
యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రభువు మన జీవితములో చేసిన
ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా వుండాలి.
అంతేకాకుండా మనకు కలిగిన ప్రతి శ్రమలయందును, నిరుత్సాహ పరిస్ధితుల యందును
కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా వుండాలి. అదే దేవుడు మననుండి
కోరుకొనేది. ఏ రీతిగా మనము ఉన్నాము? దేవుని చిత్తము చేయువారముగా ఉన్నామా?
ప్రియమైన దేవుని బిడ్డలారా పైన చెప్పబడిన
రీతిగా మన జీవితాలు పరలోకరాజ్యము వెళ్ళుటకు ఈ అర్హతలు కలిగి
జీవించినట్లయితే ప్రభువు ఎప్పుడు వచ్చినా ఆ పరలోక రాజ్యము చేరుటకు
సంసిద్ధముగా వుంటాము. మరియు మనకు పరలోకములో ఘన స్వాగతం కలుగును. గనుక అట్టి
కృప మనందరికి దయచేయును గాక! ఆమేన్.
0 comments:
Post a Comment