Breaking
Loading...

Today's Quote

Today's Quote
Home » » తగ్గింపు

తగ్గింపు

 
 
 ప్రతి జీవికి ఒక ఆత్మ కథ వున్నట్టుగా, ప్రతి గ్రామానికీ, ప్రతి పట్టణానికీ ఒక ఆత్మ కథ వున్నది. యేసుని జననమునకు ముందు ఒక కుగ్రామం వుంది. అది చాలా స్వల్పమైన గ్రామం కాబట్టి దానికి ఎలాంటి విలువా లేదు. అదే బెత్లెహేము. అలాంటి బెత్లేహేమును దేవాదిదేవుడు ఏర్పరచుకున్నాడు. అందులోనుండే యూదుల రాజును ఉదయింపజేసేందుకు.
(మీకా 5:2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.)
అంటే ఇశ్రాయేలీయులను యేలబోవువాడు అనగా క్రీస్తు – బెత్లెహేము లోనుండే కదా వచ్చింది. ఈ ప్రవచనం యేసుని గూర్చియే చెప్పబడింది. అలాంటి మారు మూల కుగ్రామం, ఎలాంటి పేరూ ఎన్నికాలేని బేత్లెహేము ఈనాడు దేవునిచే ఎన్నిక చేయబడి ఆశీర్వదించబడినందున ప్రపంచలోనే అత్యంత ఘనమైన పవిత్ర స్థలంగా గుర్తింపును, ఖ్యాతిని పొందింది.
అలాగే లేఖనాల ప్రకారం, యూదుల రాజు కన్యక గర్భమున జన్మిస్తాడని తెలిసిన వాళ్ళంతా, ముఖ్యంగా శ్రీమంతులైనవారి యవ్వన కన్యకలెందరో తమ గర్భములో దైవ కుమారుడు జన్మిస్తాడని పెండ్లి కూడా చేసుకొనుట మాని ఎదురుచూసారు . కానీ, దేవుని ఎన్నికా, ఏర్పాటూ శ్రీమంతులు, ఘనులు, జ్ఞానుల మీద లేదు కానీ లోకంలో ఎటువంటి ఎన్నికా లేని ధీనురాలు, విధేయురాలు, బీదరాలైన కన్య మరియ పట్ల వున్నది. మరియ నజరేతువాసియైనప్పటికీ, అప్పటికే బెత్లేహేమీయుడైన యోసేపునకు ప్రధానము చేయబడిన కారణమున ఆమె కూడా బెత్లేహేమీయురాలిగా మార్చబడింది.
దేవుడు మొదటిగా ఎవరిలోనైనా చూసేది తగ్గింపు స్వభావమే. ఆయన తగ్గించుకొను ప్రతి వానిని హెచ్చిస్తాడు. హెచ్చించుకొను ప్రతివారిని తగ్గిస్తాడు. అందువల్లనే, మరియ దేవునిచే ఎన్నిక చేయబడింది. మనం బైబిలు గ్రంధములో ఎవరిని పరిశీలించినప్పటికీ వారిలోని తగ్గింపు, ధీనత్వం, విధేయతలే విధేయుడైన దేవునిచే ఎన్నుకునేల చేసాయి. అందువలననే మరియ దేవుని కృప పొందింది. (లూకా 1:20 - .... దూత మరియా,భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.)
లోకములో మనము గాడిదను చాలా విలువలేనిదానిగా చూస్తాం. కానీ దేవుడు అలాంటి దాన్ని కూడా కొన్ని సందర్భాలలో వాడుకున్నాడు. ఒక ప్రవక్తకు దేవుని మార్గం తప్పినపుడు అతనికి బుద్ధి చెప్పుటకు మానవస్వరమిచ్చి వాడుకున్నాడు. (జెకర్యా 9:9. సీయోను నివాసులారా, .............. నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. - అను లేఖనములు నెరవేరబడు నిమిత్తము యేసు కట్టబడి యున్న గాడిద పిల్లను అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పి వాడుకున్నాడు.) అలాగే మనం చాలా తక్కువగా చూసే కాకిని కూడా, ప్రవక్తయైన ఏలియాను పోషించుటకు నియమించి వాడుకున్నాడు. మనం గాడిదల్లా భారాలు మోస్తూ శ్రమల్లో, బాధల్లో కట్టబడి నలిగిపోయి దిగాజారిపోవటం యేసునకు ఇష్టం కాదు. మనలను స్వతంత్రులుగా చేసి హెచ్చించాలన్నదే ఆయన వాంఛయైయున్నది.
యేసు విద్యలేని, పామరులైనవారినే శిష్యులనుగా ఏర్పరచుకుని అపోస్తులుగా, భూలోకమును తల్లక్రిందులు చేయువారిగా తయారుచేసాడు. ఒకానొక సందర్భంలో డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు అని చెప్పి ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినందుకు తండ్రిని స్తుతించెను . (లూకా 10:17-24)
మనం, ఇప్పుడు చదివిన మాటలను జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే..... లోకములోనుండు వెర్రివారు, బలహీనులైనవారు,నీచులైనవారు, తృణీకరింపబడినవారు, ఎన్నికలేనివారు ఎన్నిక చేయబడి, గొప్ప గొప్ప మర్మాలను పరలోకపు తండ్రిచే తెల్సుకుంటూ, శత్రువు బలమంతటిమీద తండ్రిచే మనకు అనుగ్రహించబడిన అధికారముచేత క్రీస్తునకు అసలైన శిష్యులుగా మారి పాములను తేళ్లను త్రొక్కుతూ, అన్నిటిలో విజయాన్ని పొందుతూ, ఆయనను పోలి జీవిస్తున్నపుడు మన పరిశుద్దాత్మ తండ్రి ఎంతగానో ఆనందిస్తాడు.
దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనేలేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తు వాడు ఆయనే. - 1 సమూయేలు 2:8
1 కోరింథీయులకు 1:26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతినిజ్ఞానులైనను ఘనులైనను కులీనులైనను అనేకులు పిలువబడలేదు గాని . ఏ శరీరియు దేవునియెదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థముచేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింపబడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.
లోకం దృష్టిలో.. అబ్రహాము ముసలివాడు, యాకోబు మోసగాడు, యోసేపు తృణీకరింపబడినవాడు, మోషే నత్తివాడు, గిద్యోను పిరికివాడు, నయోమి విధవరాలు, రాహాబు మరియు సమరేయ స్త్రీలు వేశ్యలు... కానీ దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెర్రివారిని, బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని, ఎన్నికైనవారిని వ్యర్థముచేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింపబడినవారిని, ఎన్నికలేనివారిని ఏర్పరచుకొనియున్నాడు. ఆయన లోకరీతిన పైరూపాలపై , ఘనతనలపై, గతించువాటిపై దృష్టి నిలిపేవాడు కాదు. వారి వారి క్రియలను బట్టి, అంతరంగ స్వభావమును బట్టియే మనుషులను పరీశీలించి పరిశోధించేవాడు. చాలామంది ఘనతల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ, ప్రయాసపడుతూ వుంటారు. మనం దేవుని కోసం కాక, మారి దేని కోసం ప్రాకులాడిన వాటి వలన శాపమునే సంపాదించుకుంటాం. దేవుని నమ్మి ఆయన మాటల యందు విశ్వసించి, అభ్యసించిన వారికే అసలైన ఘనత, మహిమైశ్వర్యములు అనుగ్రహింపబడతాయి. మనకు దేవుని కార్యములు చేయుటవలన ఘనత రావాలే కానీ, వేరే దేనివలననూ కాదు.
దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. -1 పేతురు 5:6
తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. - మత్తయి 23:12
సర్వలోకానికీ చక్రవర్తి తానే అయినప్పటికీ సమస్తమును విడిచి, అన్నిటిలో తగ్గించుకుని, అత్యంత ధీనుడై తనచే సృజించబడిన మానవులే ఎంతగా అసహ్యించుకొని, గేళి చేసి, హింసించినా నోరు తెరువక యేసయ్య చూపిన సహనం, తగ్గింపు, ధీనత్వం, క్షమాగుణం, ప్రేమ, పరిశుద్ధత ఎంత గొప్పవో కదా...! ఆయన బిడ్డలమైన మనం కూడా అదే మార్గంలో జీవిస్తూ క్రీస్తు గుణలక్షణములను ప్రచురము చేస్తూ, ఆయన చేత తగిన సమయమందు హెచ్చింపబడువారముగా ఉండుటకు ఆయన యెద్ద నేర్చుకోవాలి.
Share this Post Share to Facebook Share to Twitter Email This Pin This

0 comments:

Post a Comment

 
Copyright © 2014. JESUS | Distributed By My Blogger Themes | Designed By OddThemes